హైదరాబాద్ శివార్లలో శివరాత్రి నాడు భక్తులతో పోటెత్తి పోయే కీసరగుట్ట తెలంగాణలోని తొలి శైవ క్షేత్రాల్లో ఒకటి. విష్ణుకుండి రాజ్యపు కోట, నివాసస్థలం వంటి ఆనవాళ్లు ఇక్కడే దొరికాయి. 1970 దశకంలో కీసరగుట్టలో జరిపిన తవ్వకాలు ఈ గుట్టను, చుట్టుపక్కల ప్రాంతాలను, విష్ణుకుండి రాజ్యంలో ప్రముఖంగా వినిపించే తుమ్మలగూడెం (ఇంద్రపాల నగరం), ధాన్య కటకం (ఇప్పటి అమరావతి), ఇంద్రకీలాద్రి (బెజవాడ), లెందులూరు (ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు)ల సరసన నిలిపింది. కృష్ణా-మూసీ- గోదావరిల మధ్య విస్తరించిన విష్ణుకుండి రాజ్యానికి ఒక నాడు కీసర రాజధాని అని చెప్పగలిగే పురావస్తు ఆధారాలను తవ్వకాలు మనకు ఇచ్చినయి. ఇప్పటికీ తుమ్మలగూడెం విష్ణుకుండి రాజధానికి శాసన ఆధారాలనిస్తే, కీసరగుట్ట కట్టడాల రూపంలో మనకు విష్ణుకుండి గుర్తులను మిగిల్చింది.
హైదరాబాద్‌కు 35 కిలోమీటర్ల దూరంలో మేడ్చల్-రంగారెడ్డి జిల్లాలో ఉన్న కీసరగుట్ట, పర్వతాపురం, కుండపల్లి ప్రాంతంలో 1970 దశకంలో తవ్వకాలు జరిగేవరకు ఇక్కడ ఒక చారిత్రక పట్టణం ఉందనేది తెలువదు. కీసరగుట్ట కథ అంటే- పదుల సంఖ్యలో ఉన్న శివ లింగాలు, హనుమంతుడితో కలిసిన స్థల పురాణంతో కూడి ఉండేది. కీసరగుట్ట పక్కనే ఉన్న చెరువు, ఇంకా చుట్టుపక్కల దొరుకుతున్న పెద్ద పెద్ద ఇటుకలు, గోడల వంటి అవశేషాలు పురావస్తు శాఖను ఆకర్షించినయి.
కీసరగుట్టను ఒక పురాతత్వ ప్రదేశంగా మార్చిన ఘనత డా.వి. వి.కృష్ణశాస్త్రికే దక్కుతుంది. గులాం యజ్దాని తర్వాత సుదీర్ఘకాలం పురావస్తు శాఖకు డైరెక్టర్‌గా పనిచేసిన కృష్ణశాస్త్రి గారి నేతృత్వంలో జరిగిన తవ్వకాల్లో వెలుగులోకి వచ్చిన ఆధారాలు విష్ణుకుండి చరిత్రకు రక్తమాంసాలను ఇచ్చాయని చెప్పొచ్చు. ఇక్కడే మనకు స్పష్టమైన నిర్మాణాలు, కోట, టెర్రకోట (మట్టితో చేసిన) బొమ్మలు, నాణేలు, శైవ మందిరాలు, జైన విగ్రహాలు- ఇలా ఎన్నో దొరికాయి. విష్ణుకుండి కాలానికి చెందిన ఇన్ని వైవిధ్యమైన పురావస్తు ఆధారాలు ఇప్పటివరకు ఏ ఇతర స్థలంలో దొరకలేదు.
కోట: తవ్వకాల్లో కోట గోడల అవశేషాలు అక్కడక్కడా దొరికాయి. తూర్పు, పడమర, ఉత్తర దిశల్లో కోట ద్వారాలున్నాయి. ఈ ద్వారాలు కాకుండా కోటనుంచి నీటి తావులకు వెళ్లేందుకు కూడా కొన్ని మార్గాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఉత్తరాన 15 కిలోమీటర్ల దూరంలో చిన్నేరు, దక్షిణాన 20 కిలోమీటర్ల దూరంలో మూసీ నది పారుతున్నా కీసరగుట్ట దగ్గర్లో పారే నీరు లేనందున నీటి కట్టలు, చెరువులు కట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. శాసన ఆధారాల ప్రకారం మొదటి గోవింద వర్మ ఎన్నో చెరువులు కట్టించినట్టు ప్రాప తటాక ఉదపాన అనే వర్ణన తెలుపుతుంది.
నివాస స్థలం: గుట్ట కింద ఇటుకలతో కట్టిన నిర్మాణాలు, మెట్లు, గదులు, మంచి వెడల్పు అయిన గోడలతో విష్ణుకుండి కాలం నాటి 8 నిర్మాణాలున్నాయి. వీటిలో నివాస గృహాలు, ఒకటి రెండు మతపరమైన నిర్మాణాలుండవచ్చు. 46 సెంటీమీటర్ల పొడవు 24 సెంటీమీటర్ల వెడల్పు 7 సెంటీమీటర్ల మందం ఉన్న ఇటుకలు కాబట్టి ఇవి విష్ణుకుండి కాల నిర్మాణమే అని తేలింది. ఈ ఆవాసాలు రాజప్రాసాదంలో భాగం. ఈ నిర్మాణం బహుళ అంతస్థుల భవనంలా కనిపిస్తున్నది.
శైవం: చెరువు పక్కనే ఇటుకలతో కట్టిన శివాలయం వంటి నిర్మాణం ఉంది. ఇప్పటి రామలింగేశ్వర ఆలయానికి ఎదుట గుట్ట మీద నల్ల బసాల్ట్ రాయి (అగ్ని పర్వతంలో వచ్చిన లావా చల్లబడిన శిల)తో చేసిన 70 శివ లింగాలు, ఇటుకలతో కట్టిన పానవట్టంపై ఉన్నాయి. మొదట పానవట్టాలు ఇటుకలతో కట్టేవారనీ, తర్వాతే పానవట్టాన్ని రాతిపై చెక్కడం మొదలైందని అనేదానికి కీసర గుట్ట ఆధారాలను ఇచ్చింది అంటారు కృష్ణశాస్త్రి. శ్రీశైలంలో శివాలయ ఆధారాలు సైతం 7 లేదా 8 వ శతాబ్దం నాటి వే. అంటే కీసరగుట్ట కచ్చితంగా శ్రీశైలం కంటే ముందుదీ లేదా అదే కాలానికి చెందిన శైవక్షేత్రం అవుతుంది.
గర్భాపాత్ర: ఇది కీసర గుట్ట అందించిన ఇంకొక అద్భుత పాత్ర. మందిర నిర్మాణ సమయంలో పునాదిలో లేక విమానం కింద పెట్టే ఒక పాత్ర ఇది. ఈ పాత్ర పైభాగంలో పంచభూతాలైన అగ్ని, జల, వాయు, ఆకాశ, భూమిలను మానవరూపంలో, చుట్టూ సర్పాలు చుట్టుకొని (వాసుకి, అర్గల కావచ్చు) ఉంటుంది. ఈ గర్భాపాత్ర విశ్వానికి చిహ్నంగానూ, ధన, ధాన్యాలతో కూడిన భూదేవికి ప్రతీకగాను చూస్తారు. ఈ అందమైన గర్భాపాత్రను ప్రస్తుతం రాష్ట్ర హెరిటేజ్ శాఖ మ్యూజియంలో చూడొచ్చు.
లజ్జాగౌరి (అమ్మ తల్లి): కీసరలో దొరికిన లజ్జాగౌరి ప్రతిమ, అమ్మ తల్లులను పూజించే సంస్కృతిలో వస్తున్న మార్పులను సూచిస్తున్నది. నగ్న ప్రతిమ తల భాగంలో కమలం పువ్వులోని ఫలదీకరణం చెందిన భాగం, ఒక చేత శివలింగం, ఇంకో చేత సింహం తల- ఇలా పునరుత్పత్తికి సంబంధించిన మత చిహ్నాలు కొత్త రూపుదిద్దుకుంటున్న కాలం ఇది. తర్వాతికాలంలో సంతానం కోసం పూజించే రేణుకా ఎల్లమ్మ ఆచారానికి ముందున్న ఆచారం, ఆధారం ఇది.
ఇక్కడ తవ్వకాల్లో సుమారు 5-8 అంగుళాల పొడుగున్న12 జైన తీర్థంకరుల లోహ విగ్రహాలు దొరికాయి. అంటే ఇక్కడ శైవంతో పాటు జైనం కూడా ప్రజల మతంగా ఉన్నట్టు అర్థమవుతున్నది. రాతితో చేసిన గణేశుడి విగ్రహం, మట్టి, సున్నంతో చేసిన బొమ్మలు, 270 విష్ణుకుండి రాగి నాణేలు దొరికాయి.
తొలి తెలుగు శిలాక్షరం ఇక్కడే ఉంది. ఒక గుట్ట మీద బండకు చెక్కి ఉన్న ఐదక్షరాలు ప్రత్యేకమైనవి. ‘తులచువాండ్రు’ ఇప్పటివరకు దొరికిన తెలుగు లఘు శిలా శాసనాల్లో మొదటిది. ఇంతకూ ముందు తెలుగు పదాలుగా భావిస్తున్న అన్ని నాణేలపై ఉన్నందున దీన్ని తొలి తెలుగు లఘు శిలా శాసనం అనాలి. లిపిని బట్టి ఇది ఐదవ శతాబ్దం నాటిదని శాసన నిపుణులు నిర్ధారించారు. దీని తర్వాత క్రీ. శ. 575లో రేనాటి చోళులు వేయించిన, కడప జిల్లాలో దొరికిన కలమళ్ళ శాసనం, పూర్తిస్థాయి తొలితెలుగు శాసనం.
ఈ ‘తులచువాండ్రు’ గొప్పదనమేమంటే ఇది తెలుగులో చేసిన తొలి సంతకం. సమిష్టితత్వం లేకపోతే గండశిలల్ని తొలచి గుళ్ళు, విహారాలు, శిల్పాల్ని శిల్పకారులు చెక్కలేరు. అందుకేనేమో శిలపై వారి ప్రతిభ మనకు తెలుగులో తొలి సంతకంగా మారి శిలాక్షరమైంది. ఇక్కడ ఏ ఒక్క చెక్కినవాడి పేరు కాకుండా, చెక్కిన సమూహం చేసిన పలకరింపు శిలాక్షరమైంది.
ఇంగ్లీష్‌లో inscription అనే పదానికి తెలుగులో శాసనం అని వాడుతున్నాం. శాసనం అంటే రాజులు, రాణులు, లేదా అధికారులు జారీ చేస్తారన్న అభిప్రాయం ఏర్పడుతది. అందుకని శాసనం బదులు లేఖనం లేదా స్పష్టమైన మరో పదాన్ని వాడాలి. అప్పుడు కొన్ని అక్షరాలున్న రాతలకూ చరిత్రలో స్థానం సుస్థిరమవుతుంది. ఈ లేఖనం పదం సంస్కృతం కాబట్టి రాతి రాతలు, రాగి రేకు రాతలు అని వాడితే తెలుగు భాష నెత్తిన పాలు పోసిన వాళ్లమవుతాం.
కీసరగుట్టలో ఇప్పటికీ విష్ణుకుండిన కట్టడాలను చూడొచ్చు. తవ్వకాల్లో బయటపడిన నిర్మాణాలను పరిరక్షించి, పురావస్తు శాఖ వాటిని అదే రూపంలో చరిత్ర ప్రేమికుల కోసం, సందర్శకుల కోసం నిలిపింది. ప్రజలకు, చరిత్ర ప్రేమికులకు, పరిశోధకులకు కీసరగుట్ట మీద మరింత ఆసక్తిని జనింప చేయవలసి ఉంది.
కీసరగుట్ట తెలంగాణ చరిత్రకు కొన్ని ముఖ్య ఆధారాలను ఇచ్చింది. తొలి శైవ ఆలయాలు, విష్ణుకుండి కాలపు నిర్మాణాలు, శిలపై తొలి తెలుగు అక్షరాలు, శైవం, దానితో పాటే జైనం – ఇలా చరిత్ర పుటలను పరిపుష్టం చేసింది. 1980 దశకం తర్వాత మళ్లీ ఈ ప్రాంతంలో పరిశీలన, తవ్వకాలు జరగకపోవడంతో విష్ణుకుండి చరిత్రపై పరిశోధన ఆగిపోయింది. కీసరకు 15 కిలోమీటర్ల దూరంలో ఘట్కేసర్ ఉంది. ఘటికేశ్వరం అనే పదానికి ఘట్కేసర్, రూపాంతరం. ఘటిక అంటే వైదిక పాఠశాల వంటిది. వైదిక మతం పుంజుకుంటున్న ఈ కాలంలో ఇక్కడ ఘటిక ఉండటం ఆశ్చర్యం కాదు. కానీ ఇప్పటికీ ఘట్కేసర్ ప్రాంతంలో పరిశోధన జరగలేదు.
-డా. వీ వీ కృష్ణశాస్త్రి
-డా. ఎం.ఏ. శ్రీనివాసన్ ,81069 35000