iBet uBet web content aggregator. Adding the entire web to your favor.
iBet uBet web content aggregator. Adding the entire web to your favor.



Link to original content: http://te.wikipedia.org/wiki/దామెర_రాములు
దామెర రాములు - వికీపీడియా Jump to content

దామెర రాములు

వికీపీడియా నుండి
దామెర రాములు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల కవి సమ్మేళనంలో కవితాగానం చేస్తున్న దామెర రాములు
జననందామెర రాములు
(1954-07-19)1954 జూలై 19 .
India హవేలి శాయంపేట , గీసుగొండ మండలం , వరంగల్ జిల్లా, తెలంగాణా
వృత్తివైద్యుడు.
మతంహిందూ.
భార్య / భర్తశోభారాణి.
పిల్లలువరుణ్, వసు.
తండ్రిమెట్టయ్య.
తల్లినరసమ్మ.

తెలంగాణా పునర్నిర్మాణం కోసం ఉద్యమించిన కవులలో దామెర రాములు ప్రముఖుడు.అతను 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'వచన కవిత' విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట్ గ్రామంలో 1954, జూలై 19 తేదీన మెట్టయ్య, నరసమ్మ దంపతులకు జన్మించాడు. దళిత కుటుంబంలో పుట్టిన ఇతడు సమాజం నుండి వివక్షను, అవమానాలను ఎదుర్కొని వాటిని అధిగమించడానికి విద్యార్థి దశ నుండే వామపక్ష భావాలకు ఆకర్షితుడై ఉద్యమాల వైపు మళ్లి అక్షరాన్నే ఆయుధంగా మలుచుకున్నాడు. విప్లవ విద్యార్థి సంఘాలలో చురుకుగా పాల్గొన్నాడు. గాంధీ వైద్యకళాశాల నుండి ఎం.బి.బి.యస్ చేసి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.డి.చదివాడు. కొంతకాలం ప్రభుత్వ డాక్టరుగా పని చేసి ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో స్థిరపడి అక్కడే స్వంతంగా నర్సింగ్ హోమ్‌ను నడుపుతున్నాడు. విరసం (విప్లవ రచయితల సంఘం) సిటీ యూనిట్ కన్వీనర్‌గా, కాకతీయ యూనివర్శిటీ బోర్డు మెంబర్‌గా, నిర్మల్ ఐ.ఎం.ఎ. అధ్యక్షుడిగా, తెలంగాణా రచయితల వేదిక రాష్ట్ర కార్యదర్శిగా వివిధ పదవులు నిర్వహించాడు.

రచనలు

[మార్చు]
  1. కోరస్
  2. నెత్తుటి వెన్నెల
  3. జయహే తెలంగాణా
  4. కొర్రాయి
  5. అసలు ముఖం
  6. దామెర కవితాసర్వస్వం
  7. దామెర కవితానుశీలన
  8. అక్షర కవాతు
  9. నిప్పులు
  10. గంగమ్మ కథలు
  11. సాహిత్య వ్యాసాలు

పురస్కారాలు

[మార్చు]
  • రంజని-కుందుర్తి అవార్డు
  • కళాలయ అవార్డు
  • ఎక్స్‌రే అవార్డు
  • సి.నా.రె. సాహిత్యపురస్కారం
  • చికిత్సారత్న బిరుదు

రచనల నుండి ఉదాహరణ

[మార్చు]

విరామం ఓటమి కాదు
తొక్కి పట్టినం
పాడుతున్న గొంతుని
ఎత్తిపట్టిన పిడికిలిని
బూటుకాళ్లకింద అణగ
దొక్కినం ఇగ
వాడు లేసుడు కల్ల
గొంతునిండా బలం పిండుకుని
పాడటం భ్రమ అని..
ప్రజల చెమటని క్రూర పరిహాసం చేసేవాళ్లు
అధికార ధన మదాంధతతో
అన్నూ మిన్నూ కానని వాళ్లు
పండుగ జేసుకుంటున్నరు
నవ్వులు రువ్వుకుంటున్నరు
కేరింతల్తో మత్తులో
మైమరిచి జోగుతున్నరు
అయినా వాడు లేస్తడు
గొంతు సవరించుకుంటడు
సవరించుకున్న గొంతు సుళ్లు తిరిగి
జడవిచ్చుకునే సమువూదమైతది
చేతివేళ్లు పిడికిలిగా బిగుసుకుంటై
వాడి చేయి శూలాయుధమైతది
వాడు లక్ష్యం విస్మరించడు
వాని పని అయిపోయిందనుకోవద్దు
వాడు మళ్లీ మళ్లీ లేస్తూనే ఉంటాడు
వాడి ఆకాంక్ష ఆవేదన అలజడి ఆందోళన
ఆరాటం దేనికోసమో
చర్చ చేయనంతకాలం
సానుకూల పరిష్కారం రానంతకాలం
వాడు పాడుతూనే ఉంటాడు
వానిపాట నదీ నదాలు
అడవులు పంటపొలాలు
గుట్టలు గుహలూ
భూన భోంతరాళం
మార్మోగుతోంది
నినాద సందేశమై
ఫేసు బుక్కులో
పరివ్యాప్తమౌతోంది
ఆకట్టుకుని ఆలోచింపజేసే
వాడిపాట ఉత్తేజ తరంగాలుగా
పరివర్తన చెంది ప్రసారమై
కర్తవ్యోన్ముఖుల్ని చేస్తోంది
జవసత్వాలు కూడదీసుకున్న
వాడి పిడికిలి ప్రకంపనాలకు
ధృతరాష్ట్ర పీఠాలు కుప్పకూలక తప్పదు
వాడి లక్ష్యం నెరవేరక తప్పదు
వాణ్ణి తొక్కేసినమని ఏమాత్రం
విర్రవీగి విందులు చేసుకోవద్దు
వాడు అజేయ ప్రజాబలసంపన్నుడు
ఉద్యమ వీరుడు
భవిష్యత్తరానికి
స్ఫూర్తి ప్రదాత...

మూలాలు

[మార్చు]